Wednesday 10 June 2020

ప్రైవేటీకరణే పరమౌషధమా? - సాజి నారాయణన్ బి.యం.ఎస్ జాతీయ అధ్యక్షులు

  ప్రైవేటీకరణే పరమౌషధమా?
- సాజి నారాయణన్ బి.యం.ఎస్ జాతీయ అధ్యక్షులు 

భారతదేశానికి ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఏది మంచిది?’ అని భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకులు కీ.శే. దత్తోపంత్ ఠేంగ్డేజీని అడిగితే ఆయన సమాధానం చెపుతూ మాజీ చైనా ప్రధాని, కమ్యూనిస్ట్ నాయకుడు డెంగ్ జియావో పింగ్ చెప్పిన మాటలను ఉదహరించారు. ``పిల్లి నల్లగా ఉందా, తెల్లగా ఉందా అన్నది ప్రధానం కాదు. అది ఎలకల్ని పట్టుకుంటోందా, లేదా అన్నది ముఖ్యం’’అని డెంగ్ అనేవారు. ఆర్ధిక వ్యవస్థలో వివిధ రంగాలకు ఏది మంచి చేస్తుందో ఆ విధానాన్ని అనుసరించాలి. అందుకనే ఠేంగ్డేజీ కమ్యూనిస్టులు ప్రయత్నించినట్లుగా ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రభుత్వపరం చేయమనిగాని, పెట్టుబడిదారులు భావించినట్లుగా ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రైవేటుపరం చేయాలనిగాని చెప్పలేదు. దేశాభివృద్ధిలో ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు రెండూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. కానీ ఒక రంగానికే ప్రాధాన్యతనిచ్చి మరో రంగాన్ని పూర్తిగా మటుమాయం చేయాలనుకున్నప్పుడే సమస్యలు వస్తాయి. 

ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు ఏ స్థానం ఇవ్వాలి, దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వలన్నది నిర్ణయించుకోవడంలోనే ప్రభుత్వ సలహాదారులు గందరగోళపడుతుంటారు. మనకి ప్రైవేటు సంస్థలు అవసరమే. కానీ ప్రభుత్వ సంస్థలను తీసివేసి ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేటీకరణగాని, జాతీయకరణగాని మితిమీరిపోకూడదు. జాతీయస్థాయిలో అభిప్రాయాలు సేకరించి, ఆయా రంగాలకు చెందినవారి సలహాలు తీసుకుని, ఆర్ధిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని అంచనా వేసుకుని ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవచ్చును. అయితే మన విధాన నిర్ణేతలు అలాంటి పద్దతిని పాటించడం లేదు. దానివల్ల దేశం నష్టపోతోంది. నమ్మకాలు, విశ్వసాలపై ఆధారపడి ఆర్ధిక వ్యవస్థను నడపాలని ప్రయత్నిస్తున్నారు. పడికట్టు సిద్ధాంతాల ఆధారంగా విధానాలు రూపొందిస్తున్నారు. 

ప్రభుత్వరంగ సంస్థలపై విశ్వాసం లేకపోవడం వల్ల అన్ని సమస్యలకు ప్రైవేటీకరణే పరమౌషధమని అనుకుంటున్నారు. ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి మూడు ముఖాలు ఉన్నాయి. అవి – సరళీకరణ(liberalization), ప్రైవేటీకరణ(privatization), వైశ్వీకరణ(globalization). వీటినే క్లుప్తంగా LPG అంటారు. అన్ని ఆర్ధిక సమస్యలకు ప్రైవేటీకరణే పరిష్కారమని కొందరు అంటారు. రైల్వే శాఖ బాగా పనిచేయాలంటే `కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ’ వల్లనే సాధ్యమంటారు. ఆఖరుకు ప్రభుత్వయంత్రాంగంలో సంస్కరణలు తేవాలన్నా `ప్రైవేటీకరణే’ మార్గమని గట్టిగా చెపుతారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రైవేటు రంగానికి చెందిన తొమ్మిదిమంది అదనపు కార్యదర్శులుగా ఉన్నారు. ఇలాగే సాగితే రాబోయే రోజుల్లో సూపర్ మార్కెట్ నిర్వాహకులనే ముఖ్యమైన మంత్రిత్వశాఖల కార్యదర్శులుగా నియమించినా ఆశ్చర్యపోనవసరంలేదు. పెట్టుబడిదారీ విధానపు ఆధునిక ప్రవక్త అయిన పాల్ క్రగ్ మన్ కూడా తాను వ్రాసిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ వ్యాసానికి `దేశమంటే కంపెనీ కాదు’ అని శీర్షిక పెట్టాడు. ఇంతకీ భారత ఆర్ధిక సమస్యలను ప్రైవేటీకరణ పరిష్కరించగలదా? అన్నదే అసలు ప్రశ్న. 

ప్రపంచ ఆర్ధిక సంక్షోభ పాఠాలు 

చాలా కాలం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ గా ఉన్న అలన్ గ్రీన్ స్పాన్ `మార్కెట్ దైవస్వరూపం’ అంటూ నినాదం ఇచ్చారు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే శక్తి మార్కెట్ కు ఉందన్నారు. కానీ 2008లో ప్రపంచమంతా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు గ్రీన్ ను పార్లమెంట్ ఛైర్మన్ వివరణ అడిగారు. అమెరికాలో ఏం జరుగుతోందో చెప్పాలని పార్లమెంట్ సభ్యులంతా నిలదీశారు. వారడిగిన ప్రశ్నలన్నిటికి గ్రీన్ ఒక్కటే సమాధానం చెప్పారు `నేను పొరపాటు చేశాను’ అని. ఈ తప్పులకు అమెరికా ఎలాంటి మూల్యం చెల్లించుకోవలసివస్తుందనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్ధిక సంక్షోభం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న లోపాలను, ముఖ్యంగా ప్రైవేటీకరణలో లోపాలను బట్టబయలు చేసింది. సంక్షోభం తరువాత పాలన చేపట్టిన ఒబామా ప్రభుత్వం పెట్టుబడిదారీ సూత్రాలకు విరుద్ధంగా జాతీయకరణను వేగవంతం చేయడం, బ్యాంక్ సంస్కరణలు, విలీనాలను నిలిపివేయడం, మార్కెట్ లను, షేర్ మార్కెట్ లను నియంత్రించడంవంటి చర్యలు చేపట్టింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అలాంటి సంక్షోభాలకు దారితీసిన విధానాలు, వాటిని ప్రవచించిన మేధావులను సంస్కరణ పేరుతో భారత్ తెచ్చి నెత్తిన పెట్టుకుంది. పూర్తిగా విఫలమైన పాశ్చాత్య విధానాలనేగాక, ఆ పెట్టుబడిదారీ విధానాలను గట్టిగా నమ్మిన నిపుణులను తెచ్చి ఆర్ధిక సంస్కరణల సలహాదారులుగా నియమించుకుంది. ఆర్ధిక వ్యవస్థలో ముఖ్యమైన పరిశ్రమలు, కార్మికులు, జాతీయ వ్యవస్థ వంటివాటిని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణను పరిశీలించాలి. 

ప్రభుత్వరంగ సంస్థలది సేవాదృక్పధం 

భారీ ప్రభుత్వరంగ వ్యవస్థతో కూడిన ప్రభుత్వ అజమాయిషీలోని ఆర్ధిక నిర్వహణ విధానాన్ని 1944లో ఎనిమిదిమంది ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్తలు ప్రతిపాదించారు. ప్రజల అవసరాలను తీర్చేవి, వ్యూహాత్మక రంగానికి చెందినవి, భారీ పెట్టుబడులు అవసరమైన పరిశ్రమలను ప్రభుత్వరంగ సంస్థలుగా ఉంచాలన్నది వారి ప్రతిపాదన. ఆ విధంగా సేవా లక్ష్యం కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు ప్రజలకు ఎంతో మేలు చేశాయి. అందుబాటు ధరల్లో తమకు కావలసిన వస్తువులు లభించాలని ప్రజలు కోరుకుంటారు. ప్రభుత్వరంగ సంస్థలు ధరలను నియంత్రించే పని కూడా చేస్తాయి. ప్రైవేటు సంస్థల దృష్టి కేవలం లాభార్జనపై ఉంటుంది కాబట్టి సరఫరాను నియంత్రించడం ద్వారా అటు డిమాండ్ ను, ఇటు ధరను పెంచుకోవాలని చూస్తాయి. ప్రభుత్వరంగ సంస్థలు లాభాలు ఆర్జిస్తున్నాయా, ఆర్జిస్తాయా అన్నది ప్రధానం కానేకాదు. జాతీయ ప్రయోజనాలను నెరవేర్చడమే వాటి ప్రధాన లక్ష్యం. కాబట్టి ప్రభుత్వరంగ, ప్రైవేటురంగ సంస్థల లక్ష్యాలు, పాత్రలు వేరువేరు. ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వ అజమాయిషీలోనే ఉండాలని అనేక కమిటీలు స్పష్టంచేశాయి. ఈ సంస్థల ప్రధాన లక్ష్యం ప్రజలకు సేవలు అందించడమేనని బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల పాత్రను పరిశీలించిన చక్రవర్తి, ఖుస్రో కమిటీలు తేల్చాయి. అందుకనే `ప్రాధామ్య రంగం’ పేరుతో బ్యాంకులు గ్రామీణాభివృద్ధికి తప్పనిసరిగా 40శాతం ఖర్చుపెట్టాలని చెప్పారు. కానీ బ్యాంకుల ప్రైవేటీకరణతో ఇది 10శాతానికి పడిపోయింది. అమెరికా వంటి పెట్టుబడిదారీ దేశాలు కూడా చమురు, ఇంధన రంగాలను వ్యూహాత్మక రంగాలుగా గుర్తించి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంచాయి. 

లాభాల బాటలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు 

ఒక కుక్కను చంపాలంటే ముందు దానికి పిచ్చిపట్టిందని ప్రచారం చేయాలి. అప్పుడు మన పని సులభమవుతుంది. ఇదే పద్దతిలో ప్రభుత్వరంగ సంస్థలు నిరుపయోగమైనవని ప్రైవేటీకరణను కోరుకునేవారంతా ప్రచారం చేస్తుంటారు. ఆశించినంత ఆదాయాన్ని పొందడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు `ఆర్ధిక నిపుణులు’ వెంటనే దీనికి కారణం ప్రభుత్వరంగ సంస్థలే అంటూ గగ్గోలుపెడతారు. అవి ప్రభుత్వానికి గుడిబండలుగా మారాయని బాధపడిపోతారు. 

ప్రస్తుతం ప్రభుత్వరంగ సంస్థలు లాభాల్లో నడుస్తున్నాయి. మహారత్న కంపెనీలవంటివి ప్రైవేటు రంగంలో కనిపించవు. ప్రభుత్వరంగ సంస్తలవల్ల నష్టాలేగాని లాభం లేదనే వాదనలో ఏమాత్రం నిజం లేదని 2018-19 సంవత్సరపు ప్రభుత్వ సంస్థల సర్వే తేల్చింది. మొత్తం 249 సంస్థల్లో 179 లాభాలు గడిస్తుంటే కేవలం 70 మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. మొత్తం నష్టాల్లో ఈ 10 కంపెనీల నష్టాలే 94.04శాతం ఉన్నాయి. మిగతా 60 కంపెనీల వల్ల 6శాతం నష్టాలు మాత్రమే వస్తున్నాయి. పార్లమెంట్ కు సమర్పించిన ఈ సర్వే నివేదిక ప్రకారం ``ప్రభుత్వరంగ కంపెనీలవల్ల 2018-19లో వచ్చిన వార్షికాదాయం 25 లక్షల 43 వేల 370 కోట్ల రూపాయలు. ఇది గత సంవత్సరం 21లక్షల, 54 వేల 774 . అంటే ఆదాయం 18.03శాతం పెరిగిందన్నమాట.’’ ఇక ఉద్యోగాల కల్పనలో కూడా ప్రభుత్వరంగ సంస్థలే ముందున్నాయి. దీనినిబట్టి బంగారు గుడ్లు పెడుతున్న బాతును ప్రభుత్వం చంపేస్తోందని అర్ధమవుతోంది. 

ముంబైకి చెందిన ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణుడు రమేశ్ దామని ప్రైవేటురంగ సంస్థలే ఎక్కువ నష్టాలలో ఉన్నాయంటున్నారు. అందుకు ఉదాహరణగా దివాన్ హౌసింగ్, మన్ పసంద్ లను పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల పనితీరును మెచ్చుకుంటూ BHEL షేర్ అంటే మదుపుదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. మరోవైపు ఫోర్బ్స్ పత్రిక ఆకాశానికి ఎత్తిన అనేక కంపెనీలు అప్పులపాలయ్యాయి. మన దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్ టెల్, ఐడియా వంటివి లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ అయిన BSNL అప్పు కేవలం 15వేల కోట్లు మాత్రమే. ప్రైవేట్ రంగ సంస్థలు సృష్టించిన, సృష్టిస్తున్న మొండిబాకీల మూలంగానే బ్యాంకులు ఇక్కట్లలో పడుతున్నాయి. విజయ్ మాల్యా వంటివారు ప్రభుత్వరంగ కంపెనీలకు చెందినవాళ్లు కారు. నేడు బొగ్గు ఉత్పత్తి చాలా లాభసాటిగా సాగుతోంది. కోల్ ఇండియా కంపెనీ గత ఏడాది కంటే రెట్టింపు లాభాలు గడించి పెద్ద మొత్తంలో పన్ను రాబడిని తెచ్చిపెడుతోంది. అయినా ఈ కంపెనీని మూసేయాలంటూ అనేకమంది ప్రచారం చేస్తున్నారు. 

నష్టాల అసలు కధ 

మన దేశంలో నష్టాల్లో ఉన్న 10 కంపెనీల్లో కేవలం ఎయిర్ ఇండియా, BSNL మాత్రమే ప్రభుత్వరంగ సంస్థలు. ఇవి కూడా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన ఎనిమిది కంపెనీలూ ప్రైవేటువే. ప్రైవేటు ఎయిర్ లైన్ పరిశ్రమ అధోగతిలో ఉంది. చిన్న కంపెనీ అయిన జెట్ ఎయిర్ వేస్ పెద్దదైన ఎయిర్ ఇండియా కంటే ఎక్కువ నష్టాల్లో ఉంది. అలాగే టెలికాం రంగంలో భారీ మౌలికసదుపాయాలు, ఉద్యోగులు ఉన్న BSNL తో పోలిస్తే చిన్నవైన ఎయిర్ టెల్, రిలయెన్స్, వోడాఫోన్ వంటివి కూడా కష్టాల్లోనే ఉన్నాయి. ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత ఏడాది లాబాల్లో ఉన్న స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, MSTC, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఏడాది తిరిగేసరికల్లా అధిక నష్టాల్లో ఉన్న 10 కంపెనీల జాబితాలో చేరిపోయాయి. దీనిని బట్టి ఎక్కడో పెద్ద తప్పు జరిగిందని అర్ధమవుతోంది. అదేమిటో పరిశీలించాలి. 

ప్రైవేట్ రంగం ఎప్పుడు విఫలమైతే అప్పుడు ప్రభుత్వరంగం ఆ భారాన్ని మోస్తూ వస్తోంది కూడా. ఆమ్రపాలి బిల్డర్స్ సకాలంలో వినియోగదారులకు ఫ్లాట్ లు పూర్తిచేసి ఇవ్వలేకపోతే సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వరంగ సంస్థ NBCC ఆ పని పూర్తిచేసింది. అలాగే ఢిల్లీ మెట్రో సర్వీస్ లను 150రూ. టిక్కెట్ రేటుకు నడపడంలో కూడా రిలయన్స్ విఫలమైనప్పుడు DMRC కేవలం రూ. 60 కే విజయవంతంగా నడిపింది. ఎయిర్ ఇండియాకు లాభాలు తెచ్చిపెట్టిన మార్గాలు, వర్క్ షాప్ లను గత UPA ప్రభుత్వం అమ్మేసింది. ఇప్పుడు అవన్నీ నష్టాల్లో ఉన్నాయి. ప్రైవేటు కంపెనీల చేతిలో ఉన్న బొగ్గు గనుల్లో ఉత్పత్తి క్రమంగా తగ్గిపోయి ఆ లోటును ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా భర్తీ చేయవలసి వస్తోంది. ఒకప్పుడు ప్రైవేటు బొగ్గు గనుల్లో ఉత్పత్తి 8శాతం(2010) ఉంటే అది ఆ తరువాత 5శాతానికి (2018)కి తగ్గింది. 2014నాటికి 218 గనులను ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తే వాటిలో కేవలం 42మాత్రమే ఉత్పత్తి ప్రారంభించాయి. అలా కేటాయింపు, తిరిగి కేటాయింపు, మళ్ళీ తిరిగి కేటాయింపు అనే ఆట సాగుతూనే ఉందన్నమాట. దీనివల్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లింది. అంతలోనే సుప్రీం కోర్ట్ ఈ కేటాయింపులన్నింటిని రద్దు చేసింది. 2011లో విజయ మాల్యకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాలపాలైనప్పుడు అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ వెంటనే ప్రభుత్వం తరఫున సహాయం ప్రకటించారు. ఆ విధంగా మన ఆర్ధిక సంస్కరణలు `నష్టాల జాతీయకరణ’, `లాభాల ప్రైవేటీకరణ’ అనే వింత సూత్రాలపై సాగాయి. 

గట్టి ప్రైవేటీకరణ లాబీ 

ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా మూల పడేసేందుకు, మూసివేసేందుకు రకరకాల విధానాలు అనుసరిస్తున్నారు. ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వరంగ సంస్థల వ్యూహాత్మక అమ్మకం, కార్పొరేటికరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బ్యాంకుల విలీనం మొదలైనవి వాటిలో కొన్ని. మన పరిశ్రమల్లో కార్పొరేటికరణ ద్వారా ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణతో విదేశీకరణ సాగుతోంది. రైల్వేలు, రక్షణ ఉత్పత్తి కేంద్రాలు, తపాలా జీవితబీమా మొదలైనవాటిని కార్పొరేటికరణ చేయాలనడం ఈ ప్రక్రియలో భాగమే. 

ఒకప్పుడు నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మాలనుకునేవారు. అయితే ఇప్పుడు లాభాల్లో ఉన్న సంస్థలు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. భారత్ కే తలమానికమైన నవరత్న కంపెనీలు కూడా అమ్మకానికి ఉన్నాయి. మహారత్న BPCL, కోల్ ఇండియా వంటివి ఆ జాబితాలో ఉన్నాయి. ఒకప్పుడు నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కొనడానికి ప్రైవేటు కంపెనీలు ఏవి ముందుకు రాలేదు. కానీ ప్రభుత్వం కష్టపడి ఆ కంపెనీని లాభాల బాట పట్టించిన తరువాత ఇప్పుడు చాలామంది ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మన విధాన సలహాదారుల విచిత్రమైన ఆలోచనలకు ఇవి కొన్ని ఉదాహరణలు. 

ఆదాయ సంక్షోభం 

ప్రభుత్వానికి నిధులు చాలా అవసరం. అయితే నిధులు సమకూర్చుకునేందుకు `నిపుణులకు’ తట్టే మొట్టమొదటి, సులభమైన మార్గం ఏమిటంటే మన పూర్వీకులు కష్టపడి సృష్టించిన ప్రభుత్వరంగసంస్థలనే ఆస్తుల్ని తెగనమ్మడం. మూలధనవ్యయం అంత వివేకవంతమైన పని కాదు. ద్రవ్య లోటు, ఆదాయం పెంచుకునే మార్గాల గురించి పునరాలోచించుకోవాలి. వివిధ అంశాలకు ప్రభుత్వం పెడుతున్న ఖర్చు వల్ల ఆదాయం పెంచుకోవలసిన అగత్యం ఏర్పడుతోంది. నష్టాలు తెస్తున్న కొన్ని ప్రైవేటు పరిశ్రమలకు సహాయం చేయడం, అనవసరమైన రాయితీలు వంటివాటికి స్వస్తి చెప్పి సంపదను సృష్టిస్తున్న కంపెనీలను ప్రోత్సహించాలి. 

ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి నీతిఆయోగ్ సలహాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఈ సంస్థ ప్రధానమైన పని `వ్యూహాత్మక విక్రయం’ అంటూ పేర్కొన్నారు. అంటే దాని అర్ధం జాతీయ సంపదను లేదా ఆస్తులను తెగనమ్మడమన్నమాట. ఈ విధాన సలహాదారులు ఒక్క కొత్త సలహా, సృజనాత్మమైన ఆలోచన అందించడంలో విఫలమయ్యారు. వీరికి తెలిసినది ఒక్కటే, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసి ఆదాయం సమకూర్చడం. 

అతి తక్కువ ధర

అతి తక్కువ ధరకు ప్రభుత్వరంగ సంస్థలు కొనుక్కునే అవకాశం వస్తే రియల్ ఎస్టేట్ మాఫియాకు పండగే. ఉదాహరణకు ముంబై జూహు బీచ్ లో ఉన్న సెంటర్ ఎయిర్ పోర్ట్ హోటల్ అమ్మకమే తీసుకుందాం. ఈ ప్రభుత్వరంగ సంస్థను కేవలం 83 కోట్ల రూపాయలకు ప్రభుత్వం అమ్మేసింది. కానీ అదే హోటల్ ఆ తరువాత నాలుగు నెలల్లోనే 115 కోట్లు పలికింది. ఈ లావాదేవిలో ప్రభుత్వ ఖజానాకు ఎంతో నష్టం వాటిల్లిందని కాగ్ కూడా తేల్చింది. ఎయిర్ ఇండియా సంస్థకు వివిధ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లలో 75 మిలియన్ డాలర్ల విలువచేసే 2500 స్లాట్ లు ఉన్నాయి. వీటిని ధశాబ్దాల ప్రయత్నం ద్వారా ఆయా దేశాలతో చర్చలు జరిపి సంస్థ సంపాదించుకుంది. అలాగే 30 దేశాల్లో ల్యాండింగ్ హక్కులు పొందింది. అయితే ఇప్పుడు ఇవన్నీ అమ్మకానికి పెట్టారు. ఇదేకాదు మహారత్న కంపెనీల్లో ఒకటైన BPCL కు వివిధ దేశాల్లో 8 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిని కేవలం 55 వేల కోట్లకే అమ్మకానికి పెట్టారు. 

చాలామటుకు ప్రభుత్వరంగ సంస్థలు ప్రారంభమయ్యే నాటికి చుట్టుపక్కల ఏమి లేదు. కానీ ఆ తరువాత క్రమంగా జనావాసాలు, టౌన్ షిప్ లు వెలిసి భూమి విలువ బాగా పెరిగింది. అందుకని ఈ భూముల్ని సొంతం చేసుకునేందుకు భూ మాఫియా విపరీతంగా ప్రయత్నం చేస్తోంది. 

లోపభూయిష్టమైన నిర్వహణ


తమ సంస్థ కోసం అంకిత భావంతో పనిచేసే కార్మికులు ప్రభుత్వరంగ సంస్థల ప్రధానమైన ఆస్తి. కానీ ఈ సంస్థలన్నీ లోపభూయిష్టమైన నిర్వహణతో సతమతమవుతున్నాయి. కంపెనీని నడిపే సామర్ధ్యం, అనుభవం ఏమాత్రం లేనివారంతా ఉన్నత స్థానాల్లో కూర్చున్నారు. రాజకీయ నేతలకు ఏ అధికారిపైనైనా కోపం వస్తే అతన్ని ఏదో ఒక ప్రభుత్వరంగ సంస్థకు ప్రధాన అధికారిగా పంపిస్తూ ఉంటారు. కేరళలో సీనియర్ డిజిపి జాకబ్ థామస్ కేరళ స్టీల్, మెటల్ కార్పొరేషన్ ఎండి గా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన న్యాయపోరాటం తాజా ఉదాహరణ. 

లోపభూయిష్టమైన నిర్వహణ, అవగాహన రాహిత్యం ప్రభుత్వరంగ సంస్థలను ఎలా దిగజారుస్తున్నాయో చూద్దాం. ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్తాన్ ఫోటో ఫిల్మ్స్ లిమిటెడ్ కొంతకాలంగా నష్టాలు తెచ్చిపెడుతున్న 10 కంపెనీల జాబితాలో కొనసాగుతోంది. అయితే ఈ డిజిటల్ ఫోటోగ్రఫి యుగంలో ఫిల్ములు అస్తిత్వాన్ని కోల్పోయాయని అందరికీ తెలుసు. ఈ మార్పును గమనించి ఆ కంపెనీ ముందుగానే జాగ్రత్తపడి ఇతర ఉత్పత్తులవైపు దృష్టి సారించి ఉంటే ఈ నష్టాలు తప్పేవి. వైవిధ్యం అనేది ఆధునిక వ్యాపార నిర్వహణ సూత్రాల్లో ముఖ్యమైనది. కాబట్టి ప్రభుత్వరంగ సంస్థలను ఆదాయంకోసం అమ్మివేయడం కాకుండా వేరువేరు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. సరిగా నిర్వహిస్తే కోల్ ఇండియా కంపెనీ దేశంలో బొగ్గు కొరతను పూరించడమేకాక దిగుమతుల అవసరం లేకుండా చేయగలదని కార్మిక సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వ సామర్ధ్యలోపానికి ప్రైవేటీకరణ మందుకాదు. అది కేవలం పెనం మీద నుంచి పొయ్యిలో పడటమే అవుతుంది. 

లోక్ సభలో ప్రభుత్వరంగ సంస్థల పని తీరు గురించి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చూస్తే లోపభూయిష్ట నిర్వహణ, అవగాహనారాహిత్యం ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. ``ప్రభుత్వరంగ సంస్థల్లో నష్టాలు రావడానికి కొన్ని కారణాలు - పనికిరాని, పాత యంత్రాలు, ప్లాంట్ లు, తలకుమించిన భారంగా మారిన వడ్డీలు, అవినీతి, వనరుల కొరత, సామర్ధ్యం కంటే తక్కువ స్థాయిలో ఉత్పత్తి, తక్కువ ఉత్పాదకత, అవసరానికి మించి సిబ్బంది, అధిక ఉత్పత్తి ఖర్చు, తగిన ధర లభించక పోవడం మొదలైనవి.’’ 

ఊబిలో కూరుకుపోవడం 

టెలికాం పరిశ్రమ, BSNL లు 2009 వరకు లాభాల్లోనే ఉన్నాయి. కానీ ఆ తరువాత నష్టాలు తెచ్చిపెట్టే 10 కంపెనీల జాబితాలో ఎందుకు చేరిపోయాయి? కేవలం ప్రైవేటు టెలికాం కంపెనీలకే బ్యాంకులు నామమాత్రపు షూరిటీతో కోట్లాది రూపాయాలు ఎందుకు కుమ్మరించాయి? అపారమైన ఆస్తులను షూరిటీగా పెట్టగలిగిన BSNL కంపెనీ బ్యాంక్ రుణాలు ఎందుకు తీసుకోలేదు? దీనినిబట్టి ప్రైవేటీకరణ అంటే క్రమంగా నాశనంచేయడమేనని, ఊబిలో దింపడమేనని అర్ధమవుతుంది. BSNL కు అతిపెద్ద నెట్ వర్క్, అపారమైన ఆస్తులు ఉన్నాయి. కానీ సలహాదారులు, నిపుణులు మాత్రం ప్రైవేటు కంపెనీలకే కోట్లాది రూపాయల బ్యాంక్ రుణాలు కుమ్మరించాలని ప్రభుత్వానికి సలహా ఇస్తారు. అతి తక్కువ బ్యాంక్ ఋణం ఉన్న BSNL ను మాత్రం పట్టించుకోరు. BSNL, MSNL లలో ఆధునీకరణ ప్రక్రియను ఉద్దేశ్యపూర్వకంగా నిలిపేశారు. వినియోగదారుల్లో ఈ సంస్థల సేవలపట్ల అసంతృప్తి కలగాలన్నది ఆలోచన. నెట్ వర్క్ ను మెరుగుపరచుకోవడం, 4జి స్పెక్ట్రమ్ వంటివి BSNL లో అడ్డుకుంటు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. ఇలా ప్రభుత్వరంగ సంస్థల్లో నాణ్యత పెంచడం, ఆధునికరించడానికి ఎలాంటి ప్రయత్నం జరగడం లేదు. ఇలా ఈ సంస్థలను తొలగించి వాటి స్థానంలో ప్రైవేటు సంస్థలను తెచ్చిపెట్టడమే లక్ష్యంగా కనిపిస్తోంది. 

ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థల CEO లకు ఒక్కటే పని, ఒకటే లక్ష్యం. అదేమిటంటే ఎలాగైనా సంస్థని నాశనం చేసి, ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయడం. తమ లక్ష్యం సంస్థను ప్రైవేటీకరణ చేయడమేనని, బాగుచేయడం కాదని అనేకమంది CEO లు బాహాటంగానే చెపుతున్నారు. ఇలా ఒక ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేయడంలో విజయం సాధించిన అధికారిని మరో సంస్థకు పంపుతున్నారు. 

`వృత్తినైపుణ్యం’ – ఇదే ప్రభుత్వరంగ సంస్థలకు శ్రీరామరక్ష 

2014 ఫిబ్రవరిలో చార్టర్డ్ అకౌంటెంట్ లు, ఆర్ధిక వృత్తి నిపుణుల సమావేశంలో మాట్లాడుతూ అప్పటి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోదీ `వృత్తి నైపుణ్యాన్ని’ పెంచుకోవడమే ప్రభుత్వరంగ సంస్థలకు శ్రీరామరక్ష అని అంటూ గుజరాత్ ఉదాహరణ చెప్పారు. ``ప్రభుత్వరంగ సంస్థలు గిట్టడం కోసమే పుడతాయనే అపప్రధ ఉంది. కానీ మేము అలా అనుకోలేదు. ఆ సంస్థలలో వృత్తి నైపుణ్యాన్ని పెంచాము, నిలబెట్టాము’’. ఇప్పటికీ ప్రభుత్వ సంస్థల విషయంలో ఇది విధానం సరైనది. 

నిర్వహణ సామర్ధ్యం లేని అధికారుల చేతిలో పెట్టడం కంటే ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణ కోసం IAS క్యాడర్ మాదిరిగానే ప్రత్యేక అధికారులను తయారుచేయాలి. 


నాసిరకం ఉద్యోగాలు


ప్రైవేటీకరణ ఉద్యోగులపాలిట శాపం. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువ. ఈ సంస్థల్లో ఉద్యోగభద్రత ఉంటుంది, తగిన జీతం లభిస్తుంది, పని వాతావరణం బాగుంటుంది, ఉద్యోగులు పని నైపుణ్యం కలిగినవారై ఉంటారు. ప్రైవేటీకరణ ప్రారంభమైతే ఉద్యోగ భద్రత ఊసే ఉండదు. జీతాలు తగ్గిపోతాయి. BSNL, MSNL నుంచి లక్షమందికి పైగా ఉద్యోగులు స్వచ్ఛంద ఉగ్యోగవిరమణ చేశారు. వీరంతా మంచి జీతాలు పొందినవారే. ఇప్పుడు ఇన్ని ఉద్యోగాలను తిరిగి భర్తీ చేస్తారా అన్నది పెద్ద ప్రశ్నే. కొద్దిమందిని తీసుకున్నా తక్కువ జీతాలకు, కాంట్రాక్ట్ ప్రతిపదికన పనిచేయవలసి వస్తుంది. అలా మంచి స్థాయి ఉద్యోగాలు కనుమరుగవుతాయి. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. 

మాన వతాదృక్పధంతో వ్యాపారం

కోవిడ్ 19 పై యుద్ధంలో భారత్ నిలబడగలగడానికి కారణం ఆసుపత్రులన్నీ ఇంకా పూర్తి ప్రైవేటుపరం కాకపోవడమే. కానీ పాశ్చాత్య దేశాల్లో ఆసుపత్రులన్నీ ప్రైవేటువే. దానితో కరోన రోగులకు చికిత్స అందించేవారే కరువైపోయారు. అందుకనే మరణాల సంఖ్య పెరిగిపోయింది. ప్రకృతి విపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడ BSNL నెట్ వర్క్ చక్కగా పనిచేస్తే ప్రైవేటు టెలికాం నెట్ వర్క్ పూర్తిగా మూలపడ్డాయి. పటిష్టవంతమైన ప్రభుత్వరంగ వ్యవస్థ ప్రజలకు శ్రీరామ రక్ష. ప్రైవేటు సంస్థలు అడ్డగోలుగా ధరలు పెంచేయకుండా ప్రభుత్వ సంస్థలే నియంత్రిస్తాయి. ప్రజలకంటే వ్యాపారమే ముఖ్యమనుకున్నప్పుడే ప్రభుత్వరంగ సంస్థలకు స్వస్తి చెప్పాలి. అన్ని ప్రైవేటుపరం చేయాలి. 

అపారమైన ఖనిజ నిల్వలు కలిగిన ప్రాంతాల్లోనే విపరీతమైన పేదరికం కనిపించడం విచిత్రమైన విషయం. భారత దేశపు తూర్పు ప్రాంతంలో అపారమైన సహజవనరులు ఉన్నాయి. కానీ విచిత్రంగా అక్కడ పేదరికం కూడా ఎక్కువే. ఈ వనరులపై కన్నేసిన ప్రైవేటు సంస్థలతో వ్యాపరలావాదేవీలు జరిపే ప్రభుత్వాలు అక్కడి ప్రజల పేదరికాన్ని రూపుమాపదం కోసం ప్రయత్నించకపోవడం విచారకరం. భారత ప్రభుత్వం వ్యాపారం కంటే వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. మానవతా దృక్పధంతో వ్యవహరించాలి. చివరి వ్యక్తి కూడా పేదరికం నుంచి బయటపడేవరకు కార్మిక సంఘాలు తమ పోరాటం ఆపకూడదు. 

ప్రైవేటీకరణ ప్రమాదాలు

అడ్డు అదుపు లేని ప్రైవేటీకరణ వల్ల దీర్ఘకాలంలో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుదేలవుతుంది. ఇప్పటికే ప్రైవేటు చేతిలో ఉన్న మన వస్తు ఉత్పత్తి రంగం రోజు రోజుకీ దిగజారిపోతోంది. ప్రైవేటీకరణ దేశానికి, ప్రజలకు, పారిశ్రామికాభివృద్ధికి, కార్మికులకు చేటు తెస్తుంది. ఇది ప్రభుత్వరంగ సంస్థాలతోపాటు దేశ ఆర్ధిక వ్యవస్థను కూడా నాశనం చేస్తుంది. `మా నిషాద!’ (ఓ వేటగాడా! నిలు).

No comments:

Post a Comment